
Relationship: పెళ్లి తరువాత స్త్రీ తన తల్లిదండ్రులకు బాసటగా నిలవగలదా? ఆ బాధ్యతను అత్తింటి వారు తిరస్కరిస్తే ఏం చేయాలి?

Relationship: వివాహం తరువాత ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని విడిచిపెట్టి మెట్టినింట అడుగుపెడుతుంది. కొత్త ఇల్లు.. కొత్త సంబంధాలు.. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంది. కొత్త జీవితం ప్రారంభం కావడంతో ఆమె బాధ్యతలు కూడా పెరుగుతాయి. అత్తింట అడుగుపెట్టిన నాటి నుంచి కొత్త కుటుంబంలో తన బాధ్యతలతో సతమతం అవుతుంది. అయితే, ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయితే.. ఆమెకు పుట్టింటికి సంబంధించిన బాధ్యతలూ తప్పనిసరి అవుతాయి. ఇటువంటి సందర్భంలో ఆమె పరిస్థితి కొద్దిగా గందరగోళంగానే ఉంటుంది. ఎందుకంటే, మన సాంప్రదాయ మనస్తత్వ సమాజంలో, భర్త, అత్త తమ కుటుంబ బాధ్యతలు మాత్రమే ఆయింటి కోడలు చూడాలని ఆశిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మన దేశంలో మెజారిటీ ప్రజలు పెళ్లి చేసుకును తమ ఇంటికి వచ్చిన ఆడపిల్ల తమ అనుమతితో మాత్రమే ఆమె తల్లిదండ్రులను కలవాలని భావిస్తారు. ఇటువంటి పరిస్థితిలో కొత్తగా పెళ్ళయిన అమ్మాయి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత.. మెట్టినింటి నుంచు ఉన్న ఒత్తిళ్ల మధ్య ఆమె నలిగిపోతుంది.
ఈ సమస్య చిన్నదిగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది చాలా జటిలమైన విషయం. ఎందుకంటే, పూర్వం ఇద్దరు లేదా ముగ్గురు కంటే కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. కాలం మారింది. ఇప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఉన్న ఒక్కగానొక్క కూతురికి వివాహం అయిన తరువాత ఆమె పుట్టింటి వైపు చూసే పరిస్థితి కూడా లేకపోతే ఆమె తల్లిదండ్రులు పెద్దవారైన తరువాత ఎలా ఉంటుంది? అదీకాకుండా ప్రస్తుతం మహిళలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను చూడటం తమ సహజ బాధ్యతగా భావిస్తారు. ఒకవేళ తన సోదరులు ఉన్నా కూడా వారు.. ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడం వల్ల పెళ్లయిన కూతురు తల్లిదండ్రుల ఆలనాపాలనా గురించి ఆందోళన చెందుతుంది.
ఇక ఒకసారి పెళ్ళయిన తరువాత ఆడపిల్లలకు ఆర్ధిక స్వతత్ర్యం కూడా తగ్గిపోతుంది. అత్తవారింట అనుమతి తీసుకోకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆ మహిళ ఉద్యోగం లేకుండా ఇంటి బాధ్యతలు మాత్రమే చూస్తుంటే ఆమె పరిస్థితి మరింత దయానీయంగా ఉంటుంది. ఎందుకంటే, తనకు కావలసిన చిన్న చిన్న అవసరాల కోసం కూడా అత్త ముందు చేయి చాపి అడగాల్సి వస్తుంది. ఒక్కోసారి ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఆమె తన భర్త లేదా అత్తగారి ముందు చేతులు చాచాల్సి వస్తుంది. ఇదంతా సంప్రదాయ పరంపర.
కానీ, చట్టపరంగా చూస్తే కనుక పెళ్లయిన తర్వాత కూడా స్త్రీకి తన తల్లిదండ్రులపై వివాహానికి ముందు ఉన్న హక్కులే ఉంటాయి. అదే సమయంలో, ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమెపై పూర్తి హక్కులు ఉన్నాయి. ఇది స్త్రీ వైవాహిక స్థితిని ప్రభావితం చేయదు. స్త్రీ తనకు కావలసినప్పుడు తన తల్లి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను కలుసుకోవచ్చు. మరోవైపు, ఆమె పని చేసి సంపాదిస్తున్నట్లయితే, ఆమె ఆర్థిక విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఆమెకు ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బు, నగలు, ఆస్తులు వాడుకోవచ్చు. ఆ డబ్బుతో, ఒకరు తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు లేదా జీవనోపాధి కోసం సాధారణ మొత్తాన్ని ఇవ్వవచ్చు. ఆమె భర్త లేదా అత్తమామలు దీనిని తిరస్కరించలేరు.
అప్పుడు ఏమి చేయాలి?
భర్త లేదా అత్తమామలు తన హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఉంటే కనుక..అప్పుడు ఆ మహిళ ఫిర్యాదు చేయవచ్చు. ఈ సందర్భంలో, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 405 అలాగే, 406 ప్రకారం చర్య తీసుకోవచ్చు.
ఉద్యోగం చేసే మహిళ తన తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధమైన హక్కు, బాధ్యత. దీని కోసం చట్టంలో ఒక నిబంధన ఉంది. దీని ప్రకారం తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని న్యాయస్థానం ఏ సమర్థుడైన వ్యక్తిని (కొడుకు లేదా కుమార్తె) ఆదేశించవచ్చు.
చట్టం ఏమి చెబుతుంది
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 125(1) ప్రకారం, ఒక వ్యక్తి పూర్తి సామర్థ్యం కలిగి ఉండి, తన తల్లి లేదా తండ్రిని చూసుకోవడానికి నిరాకరిస్తే, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తి అతని తల్లికి నెలవారీ భత్యం చెల్లించమని ఆదేశించవచ్చు.
ఈ నిబంధన కొడుకు..కుమార్తె ఇద్దరికీ వర్తిస్తుంది.
అదే సమయంలో, సెక్షన్ 9 ప్రకారం సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం, ఎవరైనా పిల్లవాడు లేదా బంధువు సీనియర్ సిటిజన్‌ను చూసుకోవడానికి నిరాకరిస్తే, బాధితునికి నెలవారీ భత్యం చెల్లించాలని ఆదేశించవచ్చు.
కొడుకు, కూతురు సమానం
హిందూ చట్టం కూడా కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఇస్తుంది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 సెప్టెంబర్ 9, 2005 నుండి అమలులోకి వచ్చింది, దీని ప్రకారం కుమార్తెలు తండ్రి, పూర్వీకుల ఆస్తికి అర్హులు లేదా వారు వారి హక్కులను తీసుకోవచ్చు. ఇప్పుడు కుమార్తెలకు అదే హక్కులు, విధులు ఉన్నాయి. అవి గతంలో కొడుకులకు మాత్రమే పరిమితం అయి ఉండేవి. సహజంగానే, తల్లిదండ్రుల ఆస్తిపై కుమార్తెలకు హక్కు ఉంటే, వారి వృద్ధాప్యంలో వారిని చూసుకోవడం కూడా వారి బాధ్యతగానే చెప్పాలి.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ-సంక్షేమం (సవరణ) బిల్లు, 2019 ప్రధాన చట్టంలోని సెక్షన్లు 2(ఎ), (బి)లను సవరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
దీని ప్రకారం, అల్లుడు, కోడలు, పిల్లలు వారి తల్లిదండ్రులు, అత్తమామలు,తాతలను కూడా నిర్వహించడం తప్పనిసరి. ఈ ప్రతిపాదిత సవరణ ఆమోదం పొందినట్లయితే, అల్లుడు తన మామగారిని నిర్వహించే బాధ్యతను కూడా భరించవలసి ఉంటుంది. సామాజిక, నైతిక కోణం నుండి కూడా, తల్లిదండ్రులకు సేవ చేయడం పిల్లల విధి. వృద్ధాప్య తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం ఒక ముఖ్యమైన బాధ్యత. ‘భర్త తల్లిదండ్రులు’, ‘భార్య తల్లిదండ్రులు’ అనే వివక్ష ఉండకూడదు.
అయినా, చట్టం చెప్పే నిబంధనలు.. శిక్షలు వీటి లెక్కలు వేసుకునే బదులు.. తన భార్య తల్లిదండ్రులు కూడా తన తల్లిదండ్రుల లాంటి వారే అని ప్రతి అల్లుడూ అనుకోవాలి. తన భార్య కుటుంబం కూడా ఆనందంగా ఉన్నపుడే తన జీవిత భాగస్వామి ప్రశాంతంగా ఉండగలదనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఆ దిశలో ప్రతి అల్లుడు ముందడుగు వేసినపుడు భార్యాభార్తల బంధాలు మరింత చక్కగా మారతాయి. చక్కటి సమాజం ఏర్పడటానికి బాటలు పడతాయి.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30nHye7
0 Response to "Relationship: పెళ్లి తరువాత స్త్రీ తన తల్లిదండ్రులకు బాసటగా నిలవగలదా? ఆ బాధ్యతను అత్తింటి వారు తిరస్కరిస్తే ఏం చేయాలి?"
Post a Comment