
Covid-19 death certificate: డెత్ సర్టిఫికెట్‌లో ‘కరోనా’ లేకున్నా.. బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Covid-19 death certificate: దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లింపు విషయంలో.. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. కరోనాతో మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రాల్లో తెలపకపోయినా.. ఆ కారణంతో పరిహారాన్ని నిరాకరించవద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని రాష్ట్రాలూ రూ.50 వేల చొప్పున బాధిత కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందేనంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల నష్టపరిహారాన్ని రాష్ట్రాలు అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పేర్కొన్న మార్గదర్శకాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం చెల్లింపు అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాలో ప్రచారం చేయాలంటూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.
కాగా.. ఇప్పటికే కరోనావైరస్ ప్రస్తావన లేకుండా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయితే… బాధిత కుటుంబసభ్యులు సంబంధిత అధికారులను ఆశ్రయించాలని సూచించింది. బాధితులు తగిన పత్రాలు సమర్పిస్తే అధికారులు డెత్ సర్టిఫికెట్‌ను సవరించి మరలా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. మరణించిన వారి మెడికల్ రికార్డులను పరిశీలించి 30 రోజుల్లో నిర్ణయం తీసుకొని పరిహారం చెల్లింపునకు సిఫారసు చేయాలంటూ ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది. ఆస్పత్రుల నుంచి రికార్డులు తెప్పించుకునే అధికారాలు ఫిర్యాదుల పరిష్కార కమిటీకి ఉంటాయని.. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో పేర్కొంది.
Also Read:
Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్!
క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత.. ప్రేమ పేరుతో నయవంచనకు గురై ఒకరు.. పేరెంట్స్ తిట్టారని మరొకరు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mnQk2w
0 Response to "Covid-19 death certificate: డెత్ సర్టిఫికెట్‌లో ‘కరోనా’ లేకున్నా.. బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు"
Post a Comment