
Heavy Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!

Rain Alert: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిదింటి వరకు మెదక్ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కుల్ అత్యధికంగా 14.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గాంగెటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో 12.10 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో 10.03 సెం.మీ., పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 9.08 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2VXXhOJ
0 Response to "Heavy Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!"
Post a Comment