-->
సుకుమార కురుప్ జీవితకథగా వస్తోన్న మూడో సినిమా.. అసలు ఎవరు ఇతడు.? చేసిన నేరాలు ఏంటి.? మీకోసమే

సుకుమార కురుప్ జీవితకథగా వస్తోన్న మూడో సినిమా.. అసలు ఎవరు ఇతడు.? చేసిన నేరాలు ఏంటి.? మీకోసమే

2

దుల్కర్‌ సల్మాన్ హీరోగా వస్తున్న కురుప్‌ సినిమా విడుదలకు ముందే బోలెడంత క్యూరియాసిటీని జనరేట్‌ చేసింది. అందుకు కారణం అది క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ కావడమే! అంతకు మించి అది ఓ భయంకరమైన క్రిమినల్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించింది కావడమే! ఇంచుమించు 38 ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడు సుకుమార్‌ కురుప్‌ కథ నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అతడి కథ ఆధారంగా ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. దుల్కర్‌ నటించిన కురుప్‌ సినిమా మూడోది. 1984లో ఎన్‌హెచ్‌ 7 అనే సినిమాకు ఆధారం కురుప్‌ జీవితకథే! 2016లో ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తీసిన పిన్నెయుమ్‌ సినిమా కూడా కురుప్‌ క్రైమ్‌ స్టోరీ ఆధారంగా తీసిందే! కేరళ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ముప్పు తిప్పలు పెట్టిన సుకుమార్‌ కురుప్‌ ఎవరు? అతడు చేసిన ఘోరమైన నేరమేమిటి? తెరకెక్కించాల్సినంతగా పాపులర్‌ ఎలా అయ్యాడు? అతడి పాతకానికి బలైన వారు చెబుతున్నదేమిటి?

సుకుమార కురుప్‌ కథ తెలుసుకోవాలంటే సుమారు 38 ఏళ్ల కిందటికి వెళ్లాలి. మిడిల్‌క్లాస్‌ కుటుంబం నుంచి వచ్చిన కురుప్‌ అసలు పేరు గోపాలకృష్ణ పిళ్లయ్‌..చదువయ్యాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. పూణెలో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం ఇష్టం లేకనో, ట్రైనింగ్‌కు జడిసో తెలియదు కానీ లాంగ్‌లీవ్‌ పెట్టేసి ఇంటికొచ్చేశాడు. మళ్లీ ఎయిర్‌ఫోర్స్‌ మొహం చూడలేదు. అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్లింట్లో పనిమనిషి కూతురు సరసమ్మను ఇంట్లోవాళ్లకు చెప్పకుండా ముంబాయిలోని మాటుంగాలోని ఓ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అక్కడ తన పేరును సుకుమార్‌ కురుప్‌గా చెప్పుకున్నాడు. పెళ్లికి ఓ నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ వచ్చారంతే. సాయంత్రం ఫ్రెండ్స్‌ అందరికీ పార్టీ ఇచ్చాడు. ముంబాయిలో నర్సింగ్‌ కోర్స్‌ చేసేటప్పుడు గోపాలకృష్ణకు సరసమ్మ పరిచయం అయ్యింది. పెళ్లయ్యాక అబుధాబి వెళ్లాడు. అక్కడ ఓ మెరైన్‌ ఆపరేటింగ్‌ కంపెనీలో చేరాడు. కాస్త కుదురుకున్నాక సరసమ్మను రప్పించుకున్నాడు. అప్పట్లోనే ఇద్దరి జీతాలు కలిపి 60 వేల రూపాయలు వచ్చేవి. తన బంధువులకు డబ్బు సాయం చేయసాగింది సరసమ్మ. సరసమ్మ కారణంగా ఆమె చెల్లిలి కుటుంబం కూడా బాగుపడింది. ఆమె భర్త భాస్కరన్‌ పిళ్లయ్‌కు సుకుమార్‌కు ఫ్రెండ్‌షిప్‌ బలపడింది. సుకుమార్‌ అంత సంపాదిస్తున్నా తల్లిదండ్రులు మాత్రం దగ్గరకురానివ్వలేదు. అప్పుడప్పుడు కేరళకు వెళుతుండే కురుప్‌ కూడా ఇంటికెళ్లేవాడు కాదు. తన ఫ్రెండ్స్‌కు మాత్రం ఖరీదైన కానుకలను తెచ్చి ఇస్తుండేవాడు. విందులు వినోదాలకు బోలెడంత ఖర్చు పెట్టేవాడు. కేరళకు వచ్చినప్పుడు అటు ఇటు తిరగడానికి ఓ అంబాసిడర్‌ కారు కూడా కొన్నాడు. దాన్ని చూసుకునే బాధ్యతను భాస్కరన్‌కు అప్పగించాడు. అలప్పుళాలోని అంబళపుళ ప్రాంతంలో ఓ పెద్ద ఇంటిని కట్టుకోవాలని అనుకున్నాడు. ఇంటి నిర్మాణ పనులను కూడా భాస్కరన్‌కే అప్పగించాడు.

1

 

ఇంతలోనే కురుప్‌ దంపతులు ఓ బాంబులాంటి వార్త వినాల్సి వచ్చింది. గల్ఫ్‌లో కంపెనీలు పెద్ద జీతాలవాళ్లను ఉద్యోగాల్లోంచి తీసేసి ఆ ప్లేస్‌ల్లో తక్కువ సాలరీలకు కొత్తవారిని తీసుకోసాగాయి. సుకుమార్‌ పని చేసే కంపెనీ కూడా అదే ఆలోచనలో ఉండటంతో సుకుమార్‌కు భయం వేసింది. ఉద్యోగం వదిలేసి కేరళకు వెళ్లి ఏదైనా బిజినెస్‌ చేసుకోవాలనుకున్నాడు. అదే మాటలో భార్యకు చెప్పాడు. ఇప్పటికే సేవింగ్స్‌ అన్నీ అయిపోయాయి. ఇంటి నిర్మాణం సగంలో ఆగింది. బిజినెస్‌కు పెట్టుబడి కావాలి. మీ వాళ్ల దగ్గర డబ్బుంది కానీ ఇవ్వరు. డబ్బు లేకుండా ఏమీ చేయలేం అని అంది సరసమ్మ. అర్జెంట్‌గా డబ్బు సంపాదించడం ఎలా అన్నది ఆలోచించసాగాడు సుకుమార్‌. అప్పుడే జర్మనీలో జరిగిన ఇన్సూరెన్స్‌ ఫ్రాండ్‌ గురించిన వార్త ఒకటి పేపర్లో కనిపించింది. ఒకడు తన పేర భారీగా బీమా చేసి , అచ్చం తన పోలికలతో ఉండే ఓ శవాన్ని వెతికి పట్టుకుని, అది తన శవంగానే భ్రమింపచేసి ఇన్సూరెన్స్‌ డబ్బు తీసుకున్నాడు. వేరే దేశానికి వెళ్లి అక్కడే బతికాడు. ఏదో మిస్టేక్‌ వల్ల ఇదంతా బయటకు వచ్చింది.

3

 

సుకుమార్‌ కురుప్‌కు ఈ ప్లాన్‌ తెగ నచ్చేసింది. వాడైతే మిస్టేక్‌ చేసి దొరికిపోయాడు కానీ తాను అలాంటి పొరపాటు చచ్చినా చేయనన్నది సుకుమార్‌ కాన్ఫిడెన్స్‌. ఎందుకంటే గోపాలకృష్ణ పిళ్లయ్‌గా తను చచ్చిపోయినట్టు చెకింగ్‌ వచ్చిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ లంచం ఇచ్చి మేనేజ్‌ చేశాడు కాబట్టి. తన ఆలోచనను సాహుతో చెప్పాడు. సాహూ కూడా ఇందులో రిస్క్‌ ఏమీ లేదనుకునేసి ఓకే అనేశాడు. మార్చురీలు గాలిస్తే నీ ఒడ్డూ పొడుగూ ఉన్న అనాథ శవం ఈజీగా దొరికేస్తుంది. అక్కడ దొరక్కపోతే సమాధులు తవ్వేద్దాం.. కాకపోతే ఈ పనిలో సాయం చేసినందుకు నాకు కొంచెం డబ్బులివ్వాలి. ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు చేయాలి అన్నాడు సాహు.. సుకుమార్‌ సరే అన్నాడు. మొత్తం ప్లాన్‌ను భాస్కరన్‌కు చెప్పాడు. నువ్వు ఎలా చెబితా అలా అన్నాడు భాస్కరన్‌. అలప్పుళ మెడికల్‌ కాలేజీలో పని చేస్తున్న మా బంధువును అడిగితే తప్పకుండా సాయం చేస్తాడనీ, డ్రైవర్‌గా ఉన్న పొణ్నప్పన్‌ విశ్వాసపాత్రుడని, అతడి వల్ల ఏ ఇబ్బంది రాదని భాస్కరన్‌ భరోసా కూడా ఇచ్చాడు. శవంతో పాటు కారు కూడా తగలబెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎనిమిది వేలు పెట్టి ఓ పాత అంబాసిడర్‌ కారు కొన్నాడు భాస్కరన్‌..
వేస్తున్న పాచిక చక్కగా పారుతుందన్న నమ్మకం రాగానే సుకుమార్‌ మూడు లక్షల దిర్హామ్‌లతో ఓ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 30 లక్షల రూపాయలు. సుకుమార్‌, సాహూలిద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టేసి జనవరి మొదటి వారంలో త్రివేండ్రం వచ్చేశారు. భాస్కరన్‌ ఇంట్లోనే ఉంటూ హాస్పిటల్‌ మార్చురీలు వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడా దొరకలేదు. సమాధులు కూడా వెతకడం మొదలు పెట్టారు. అక్కడా అదే పరిస్థితి. ఎందుకంటే శవం తాజాగా ఉండాలి. ఒడ్డూ పొడుగూ వయసులతో సుకుమార్‌తో పోలిక కుదరాలి. రెండు వారాలయ్యేసరికి అందరికీ విసుగొచ్చేసింది. శవం దొరక్కపోతేనేం బతికున్నవాడినే శవంగా మార్చేద్దాం అన్నాడు సుకుమార్‌.. అందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. చేస్తున్న మోసమే దారుణం.. పైగా ఇప్పుడు మర్డర్‌ అంటాడేమిటీ అని భయపడిపోయారు. నా పోలికలతో ఉన్నవాడు ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతూ కనిపిస్తే చప్పున కార్లో ఎత్తుకువచ్చేసి గొంతు నులిపి చంపేద్దాం అని తాపీగా అన్నాడు సుకుమార్‌. వాడు చచ్చాక మన అనుకున్న చోటుకు తీసుకెళ్లి కాల్చేద్దాం అని చెప్పాడు. మిగలిన ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. చివరకు శవమే దొరకనప్పడు, దొరికిన శవం సుకుమార్‌ది అయినప్పుడు మనం దొరికే అవకాశమే లేదనుకుని ఓకే చెప్పేశారు.

4

 

సుకుమార్‌ కురుప్‌ పోలికలు ఉన్న మనిషి కోసం రాత్రిపూట కారేసుకుని తిరగసాగారు. కొత్త కారులో డ్రైవర్‌ పొన్నప్పన్‌ భాస్కరన్‌, సాహూ… వెనకాతలే పాతకారులో సుకుమార్‌ సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ వ్యక్తి కోసం వెతకసాగారు. 1984 జనవరి 21 రాత్రి 11 గంటల ప్రాంతంలో నేషనల్ హైవే 47 మీద వున్న కరువాట్ట అనే ఊరిలో కల్పకావడి హోటల్‌లో డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత ఓ పాతిక కిలోమీటర్లు రోడ్డు మీద అటూ ఇటూ చూసుకుంటూ వెళ్లారు. కానీ సుకుమార్‌ పోలికలు ఉన్న వ్యక్తి ఎవరూ కనిపించకపోయే సరికి నిరాశగా వెనుదిరిగారు. తిరిగి వస్తుంటే హరిపాద్‌ దగ్గర హరి టాకిస్‌ ఎదురుగా లిఫ్ట్‌ అడుగుతున్న ఓ వ్యక్తి కనిపించాడు. అతడికి సుకుమార్‌కు పోలికలు ఉన్నాయి. దగ్గరకు వెళ్లి చూశారు. తమకు కావాల్సిన వ్యక్తి దొరికాడనుకున్నారు. అతడి దగ్గరకు వెళ్లి కారాపారు. వీరి పన్నాగం తెలియని ఆ వ్యక్తి కారెక్కాడు. అతడికి ఈథర్‌ కలిపిన బ్రాందీని బలవంతంగా తాగించారు. అతడు స్పృహ కోల్పోగానే భాస్కరన్‌, సాహులు కలిసి టవర్‌తో గొంతు నొక్కేసి ప్రాణాలు తీశారు.
చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని భాస్కరన్‌ ఇంటికి తీసుకెళ్లారు. శవం చేతికి వున్న వాచీ, ఉంగరాన్ని తీసేశారు. శవంపైనున్న బట్టలను తీసేసి సుకుమార్‌ బట్టలు తొడిగారు. మొహమంతా కాల్చేశారు. తర్వాత పాతకారు డిక్కీలో శవాన్ని కుక్కి తన్ని ముక్కం ఊరిలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత పాతకారు డ్రైవింగ్ సీటులో శవాన్ని పెట్టి, పది లీటర్ల పెట్రోల్‌ను కారుపై చల్లి కారులు అంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భాస్కరన్‌ చేయి కూడా బాగా కాలింది. మంటలను అదుపులోకి తెద్దామనుకున్నా వారి వల్ల కాలేదు. భయంతో అక్కడ్నుంచి పారిపోయారు. కొత్తకారులో భాస్కరన్‌ ఇంటికొచ్చారు కానీ కంగారులో చెప్పులు, అగ్గిపెట్టే అక్కడే వదిలేసి వచ్చారు.

ఆ రోజు ఉదయం నాలుగు గంటలకు ఓ వ్యక్తి పోలీసుస్టేషన్‌కు వచ్చి పొలంలో కారు తగలబడిపోతున్నదని, డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడని చెప్పాడు. హెడ్ కానిస్టేబుల్ వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అక్కడకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కొంతమంది ఉన్నారు. స్పీడ్‌ మీదున్న కారు టర్న్ చేస్తున్నప్పుడు కంట్రోల్‌ తప్పి పొలంలో దూసుకుని వచ్చి మంటలు అంటుకుని ఉంటాయని అనుకున్నారంతా. కబరు అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టరు హరిదాస్‌ గంటర్నర తర్వాత అక్కడికి చేరుకున్నాడు. పరిసరాలను నిశితంగా పరిశీలించాడు. ఓ అగ్గిపెట్టె, చెప్పులజత, రబ్బర్ గ్లవ్స్ ఆయనకు కనిపించాయి. గ్లవ్స్ మీద వెంట్రుక కూడా కనబడింది. గాలిలో పెట్రోలు వాసన బాగా వస్తోంది. ఎవరో అక్కణ్నుంచి పారిపోయినట్లు మట్టిలో అడుగుజాడలు కూడా కనబడ్డాయి. శవాన్ని పంచనామాకు పంపించారు. కారు సుకుమార్‌ కురుప్‌దని, రెండు వారాల కిందటే అబుధాబి నుంచి వచ్చాడని, భాస్కరన్‌ ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకున్నారు. భాస్కరన్‌కు కబురు బెట్టారు.

వెంటనే భాస్కరన్, అతని భార్య వచ్చారు. శవాన్ని చూసి ఏడ్చారు. ఒడ్డూ పొడవూ బట్టి చూస్తే శవం సుకుమార్‌దేనని ఏడుస్తూ చెప్పాడు భాస్కరన్. అలాగని ఓ స్టేటుమెంటు ఇచ్చాడు. అతన్ని పోలీసు స్టేషన్‌లో చాలాసేపు కూర్చోబెట్టి హతుడి వివరాలన్నీ సేకరించారు. మధ్యాహ్నం పోలీసు జీపులోనే ఇంటి దగ్గర దింపారు. శవాన్ని దహనం చేయవద్దని, పాతిపెట్టండి అని ప్రత్యేకంగా చెప్పారు హరిదాస్‌.

5

 

సాయంత్రానికి పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్ వచ్చింది. మంటల వల్ల చనిపోలేదని ముందే చంపేసి కారులో కూర్చోబెట్టి ఉంటారని, పైగా హతుడి పొట్టలో లిక్కర్‌తో పాటు ఇథైల్‌ ఆల్కహాల్ కూడా ఉందని నివేదిక తెలిపింది. పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ చూసిన తర్వాత హరిదాస్‌ అనుమానాలు మరింత బలపడ్డాయి. సుకుమార్‌ది యాక్సిడెంట్‌ కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని గట్టి నిర్ణయానికి వచ్చారు. ఆ పని భాస్కరనే చేసి ఉంటాడని అనుమానించాడు. అందుకు కారణం భాస్కరన్‌ చేతులు కాలి ఉండటమే! దానికి తోడు భాస్కరన్‌ను ఇంటిదగ్గర దింపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌కు భాస్కరన్‌ భార్య ఇంట్లో చికెన్‌ వండుతూ కనిపించిందట. మొహంలో ఎలాంటి విషాదఛాయలు లేవట. బావగారు చనిపోయిన రోజున ఎవరైనా చికెన్‌ వండుకుంటారా? వండుకోరు కదా! ఈ సందేహాలు రాగానే భాస్కరన్‌ను మళ్లీ స్టేషన్‌కు పిలిపించారు. అప్పుడు కూడా ఫుల్‌షర్ట్‌ వేసుకునే వచ్చాడతను. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో అతడిని ముందే చంపేసి శవాన్ని కారులు పడేసి కాల్చేసినట్టు తేలిందన్నారు హరిదాస్‌.. ఎవరో అసూయతో ఆ పని చేసి ఉంటారని, ఏడుస్తూ చెప్పాడు భాస్కరన్‌. భాస్కరన్‌ షర్ట్‌ చేతులు పైకి ఎత్తి చూస్తే మోచేయి కాలి ఉంది. పెరట్లో ఎండుటాకులు పొగేసి మంట పెడుతుంటే చేతులు కాలాయని చెప్పుకొచ్చాడు భాస్కరన్‌. ఆ సంగతేమిటో ఇంటికెళ్లి చూద్దా పద అంటూ హరిదాస్‌ తొందరపెట్టారు. వెంటనే భాస్కరన్‌ మాట మార్చేశాడు. ఇది నెల కిందట వేడినీళ్లు పడ్డ గాయమండి అని చెప్పాడు. పోలీసులకు తిక్కరేగింది. భాస్కరన్‌ బట్టలన్ని విప్పి చూశారు. కుడి కాలు కూడా కొంత మేర కాలినట్టు కనిపించింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్ చేశారు. నాకు గల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అడ్డమైన చాకిరీ చేయించుకున్నాడని, అఆ కోపం తోనే సుకుమార్‌ను చంపేశానని భాస్కరన్‌ పోలీసులకు చెప్పాడు. ఎందుకో భాస్కరన్‌ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు పోలీసులకు. భాస్కరన్‌ ఇంటికి వెళ్లి సాక్షాల కోసం వెతికారు హరిదాస్‌. పోర్టికోలో కొన్ని కాలిన వెంట్రుకలు కనిపించాయి. కాంపౌండ్‌లో కొత్త అంబాసిడర్‌ కారు కనిపించింది. కొత్త కారున్నప్పుడు పాత కారులో సుకుమారన్‌ ఎందుకు తిరిగినట్టు అన్న అనుమానం వచ్చింది. భాస్కరనే సుకుమార్‌ను చంపేసి పాతకారులో శవాన్ని పెట్టి నిప్పు పెట్టాడా అన్న డౌట్‌ కూడా వచ్చింది. ఆ తర్వాత కారు డ్రైవర్‌ గురించి వాకబు చేశారు.. అతడి పేరు పొన్నప్పన్‌.. ఎక్కడికి వెళ్లాడో తెలియదు.. కనిపించకుండా పోయాడు అని భాస్కరన్‌ చెప్పాడు.

పొన్నప్పన్‌ను పట్టుకుంటే మర్డర్‌ మిస్టరీ వీడుతుందనే కంక్లూజన్‌కు వచ్చిన హరిదాస్‌ డ్రైవర్ల యూనియన్‌ను పిలిపించి మాట్లాడాడు. పొన్నప్పన్‌ ఆచూకి తెలిసినవారు తమకు చెప్పాలని ఆదేశించారు. మరుసటి రోజున ఓ వ్యక్తి హరిదాస్‌కు ఫోన్‌ చేశాడు. పొన్నప్పన్‌ నా దగ్గరకు వచ్చాడు. మొన్న రాత్రి కారులో వస్తూ యాక్సిడెంట్‌ చేశాడట. చనిపోయిన వ్యక్తిని కార్‌లో పెట్టేసి కాల్చేశాడట. ఆ భయంతోనే మీ దగ్గరకు రాకుండా ఉన్నాడు. కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు కాబట్టి పెద్ద శిక్ష పడకుండా చూస్తానని మీరు చెబితే వస్తాడట. అని చెప్పాడు. పై అధికారులతో మాట్లాడి చెబుతాను అంటూ హరిదాస్‌ ఫోన్‌ పెట్టేశారు. భాస్కరనేమో సుకుమార్‌ను తానే చంపేశానంటున్నాడు. డ్రైవరేమో రోడ్డు మీద గుద్దేసినవాడిని కాల్చేశానని చెబుతున్నాడు. ఎవరిది నిజం? ఇంతకీ శవం ఎవరిది? సుకుమార్‌దా? లేక పొన్నప్పన్‌ యాక్సిడెంట్ చేసిన వాడిదా? అంతా అయోమయం. హరిదాస్‌కు ఎటూ పాలుపోలేదు. మళ్లీ భాస్కరన్‌ ఇంటికెళ్లారు. నువ్వు రకంగా చెబుతున్నావు. మీ డ్రైవర్‌ మరో రకంగా చెబుతున్నాడు.. ఎవరి మాట నమ్మాలి? అంటూ కాసింత సీరియస్‌ అయ్యారు హరిదాస్‌. నేను నిజమే చెప్పాను సార్‌. డ్రైవర్‌ ఎందుకు అలా చెప్పాడో నాకు తెలియదు అని తాపీగా జవాబిచ్చాడు భాస్కరన్‌.

సుకుమార్‌ నలుగురితో కలిసి తిరిగాడని చూసినవాళ్లు పోలీసుకుల చెప్పారు. డ్రైవర్‌, భాస్కరన్‌ కాకుండా మరో ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుంటే కేసు సాల్వ్‌ అవుతుందనుకున్నారు హరిదాస్‌. వెంటనే భాస్కరన్‌ పిలిపించి మిగతావారి గురించి ఆరా తీశారు. స్థానిక మిత్రులను కూడా సుకుమార్‌ వెంటేసుకుని తిరిగాడు. కాకపోతే అందులో ఒకడు అబుధాబీ ఆఫీసులో సుకుమార్‌తో పాటు పని చేసే సాహూ. అతడు కూడా సుకుమార్‌తో పాటు ఇండియాకు వచ్చాడు.. అతడు ఉండేది చావక్కాడులో అని చెప్పాడు భాస్కరన్‌. సుకుమార్‌ అంత్యక్రియలకు వచ్చాడా అని అడిగాడు హరిదాస్‌.. రాలేదని జవాబిచ్చాడు భాస్కరన్‌.. ఎందుకో సాహు మీద అనుమానం వచ్చింది హరిదాస్‌కు. ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను చావక్కాడుకు పంపించాడు. అర్ధరాత్రి పోలీసులు వెళ్లే సమయానికి ఇతడు అబుధాబీ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. సాహును పట్టుకుని నాలుగు తగిలించేసరికి కథ మొత్తం చెప్పేశాడు. సుకుమార్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని చంపేసి శవాన్ని కాల్చేసిన తర్వాత తాను తన ఊరు వెళ్లిపోయానని, సుకుమార్‌ను అలువాలో దింపేసి పొన్నప్పన్‌ వెనక్కి వెళ్లిపోయాడని, పోలీసులకు సమాధానాలు చెప్పడానికి భాస్కరన్‌ తనింట్లోనే ఉండిపోయాడని సాహూ చెప్పుకొచ్చాడు. ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చేవరకు తాను ఎవరికీ కనిపించకూడదని చెప్పి సుకుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని అన్నాడు. భాస్కరన్‌ ఏమో సుకుమార్‌ను తానే చంపానంటున్నాడు. పొన్నప్పన్‌ వర్షన్‌ మరోలా ఉంది. సాహూ ఇంకోలా చెబుతున్నాడు. ఎవరిది నమ్మాలో హరిదాస్‌కు అర్థం కాలేదు. సాహూను గట్టిగా అడిగాడు. తాను నిజమే చెబుతున్నానని, పొరపాటున చేసిన యాక్సిడెంట్‌ అని చెప్పి కొంత కాలం జైల్లో ఉండి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్‌ ఉండదని పొన్నప్పన్‌ అనుకున్నాడని సాహూ చెప్పాడు. భాస్కరన్‌కేమో ఇన్సూరెన్స్‌ డబ్బు రావడమే ముఖ్యం. అందుకే చనిపోయినవాడు సుకుమారే అని రుజువు చేయాలనుకున్నాడు. హత్యానేరంపై ఏ పదేళ్లో జైలుకు వెళ్లినా అంతకాలం సుకుమార్‌ తన కుటుంబాన్ని పోషిస్తాడన్నది భాస్కరన్‌ ధీమా అని సాహూ వివరణ ఇచ్చాడు. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. హరిదాస్‌కు ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్‌ వచ్చిపడింది. శవం సుకుమార్‌ది కానప్పుడు మరి ఎవరిది? సినిమా హాల్‌ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? వివిధ పోలీసు స్టేషన్‌ల నుంచి వచ్చిన మిస్సింగ్‌ కేసులలో సుకుమార్‌తో పోలికలు ఉన్నవారు ఎవరూ లేరు. చనిపోయిన వ్యక్తి ఫోటో కూడా లేదు. సుకుమార్‌తో పోలికలు ఉన్న వ్యక్తి కాబట్టి సుకుమార్‌ ఫోటోతోనే చనిపోయిన వ్యక్తి గురించి వెతకడం మొదలు పెట్టారు పోలీసులు. హరి టాకీస్‌ దగ్గర నలుగురైదుగురిని అడిగారు. చివరకు హాల్‌ ఓనరు కొడుకు గుర్తుపట్టాడు. చనిపోయింది సినిమా రిప్రజంటేటివ్‌ చాకో అని తేలింది. చనిపోయిన రాత్రి అతడితో చాలా సేపు ముచ్చటించానని హాల్‌ ఓనర్‌ కొడుకు చెప్పాడు. రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్న వెళ్లొచ్చు కదా అని అంటే నా భార్య ఆరునెలల గర్భిణి అని, ఆమెను రేపు చర్చిలో విందుకు తీసుకెళతానని మాట ఇచ్చానని అని చెప్పడంతో తాను కూడా బలవంత పెట్టలేదని హాల్‌ ఓనర్‌ కొడుకు అన్నాడు. క్లూ దొరకడంతో పోలీసులు చాకో ఊరికి వెళ్లారు. అక్కడతను లేకపోవడంతో భార్య శాంతమ్మను అడిగారు.

మా ఆయనది రిప్రజెంటేటివ్‌ జాబ్‌ కాబట్టి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియదు కాబట్టే పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పిందామె! 1984 ఫిబ్రవరి 1న సమాధిలోంచి శవాన్ని బయటకు తీశారు. అప్పుడే వచ్చిన కొత్త టెక్నాలజీ సూపర్‌ ఇంపోజింగ్‌ ద్వారా ఆ శవం చాకోదేనని తేచ్చారు. శవాన్ని చాకో భార్యకు అప్పగించారు. భాస్కరన్‌, పొన్నప్పన్‌లపై కేసు పెట్టారు. అప్రూవర్‌గా మారిన సాహూను వదిలేశారు. హత్యకు సహకరించినందుకు సుకుమార్‌ భార్య, భాస్కరన్‌ భార్యలపై కూడా కేసు పెట్టారు కానీ రుజువులు లేకపోవడంతో వదిలిపెట్టారు. సెషన్స్ కోర్టు భాస్కరన్, పొణ్నప్పన్‌లకు యావజ్జీవ శిక్ష వేసింది. ప్రధాన నిందితుడు సుకుమార్‌ కోసం వెతకడం మొదలు పెట్టారు పోలీసులు. పొన్నప్పన్‌ ఇచ్చిన సమాచరం మేరకు అలువాలోని అలంకార్‌ లాడ్జ్‌కు వెళ్లారు కానీ మూడు రోజుల కిందటే సుకుమార్‌ అక్కడ్నుంచి వెళ్లిపోయాడట. పోలీసులకు పంతం పెరిగింది. సుకుమార్‌ ఫోటోను రాష్ట్రమంతటా అంటించారు. పత్రికల్లో ప్రచురించారు. వివరాలు తెలిపిన వారికి బహుమతులిస్తామన్నారు. ఎంత వెతికినా సుకుమార్‌ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. ఎందుకైనా మంచిదని సుకుమార్‌ తల్లిదండ్రుల ఇంటి దగ్గర నలుగురు అండర్‌కవర్ పోలీసులను కాపలా పెట్టారు. అలా ఎనిమిదేళ్లు పెట్టినా లాభం లేకపోయింది. పోలీసులు అవిశ్రాంతంగా పట్టుదలగా వెతికారు. అలువా, చెన్నయ్‌, భూటాన్‌, అండమాన్‌, గ్వాలియర్, భోపాల్‌, ఇటార్సీ, దుబాయి, లాస్ వెగాస్‌ .. ఇలా అనుమానం వచ్చిన ప్రతీచోటా వెతికారు. పోలీసు శాఖ ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా మారిపోవడంతో అతని కేసు కింద స్టాఫ్ టిఏ, డిఏల కోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది. కొందరు పోలీసులు తమ సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారట. కురుప్‌ ఇస్లాం స్వీకరించి సౌదీఅరేబియాలోని ఓ మసీదులో ఉంటున్నాడన్న వదంతి కూడా వ్యాపించింది.

కురుప్‌ ఇప్పుడు బతికి ఉంటే 74 ఏళ్లు ఉంటాయి. గుండెజబ్బులున్నవాడు కాబట్టి ఇన్ని రోజులు బతికి ఉండటం అసాధ్యమంటారు కొందరు. 1990లో కురుప్‌ను అబ్‌స్కాండర్‌గా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు అతడి ఆస్తులను కూడా జప్తు చేసుకుంది. ఇంటి నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. భార్య సరసమ్మకు అబుధాబిలో ఉద్యోగం పోయింది. ఇక్కడికి వస్తే ఎవరూ ఆమెను దగ్గరతీయలేదు. ప్రస్తుతం ఆమె పులియూరులో అజ్ఞాతంగా బతుకుతోంది. సాహూ తిరిగి అబుదాభికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. పొన్నప్పన్‌ జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కరన్‌ పులియూరులోనే ఉంటున్నాడు . ఓ పదేళ్ల కిందట కురుప్‌ రెండో కుమారుడు సునీత్‌ పిళ్లయ్‌కు పెళ్లయింది. పెళ్లి కార్డులో తండ్రి పేరును సుకుమార పిళ్లయ్‌గానే వేశారు తప్ప ముందు కీర్తి శేషులు అని అనలేదు. అంటే ఎక్కడో అక్కడ బతికే ఉన్నాడన్నది వారి నమ్మకం. 38 ఏళ్లు అవుతున్నా ఇంకా అతడు పోలీసులకు దొరకలేదు కాబట్టే ప్రజల్లో అతడి పట్ల ఆసక్తి పెరిగింది. అందుకే అతడి జీవిత కథతో రెండు సినిమాలు కూడా వచ్చాయి. దుల్కర్‌ నటించిన కురుప్‌ మూడో సినిమా.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YCs5FV

Related Posts

0 Response to "సుకుమార కురుప్ జీవితకథగా వస్తోన్న మూడో సినిమా.. అసలు ఎవరు ఇతడు.? చేసిన నేరాలు ఏంటి.? మీకోసమే"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel