-->
Telangana Liberation Day: తుపాకీ తూటాల వర్షం కురిసినా.. ఎత్తిన జెండా దించలేదు.. నేడు తెలంగాణ వీమోచన దినం

Telangana Liberation Day: తుపాకీ తూటాల వర్షం కురిసినా.. ఎత్తిన జెండా దించలేదు.. నేడు తెలంగాణ వీమోచన దినం

Telangana Liberation Day

Telangana Liberation Day: అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో.. అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు చరమగీతం పాడారు. బారు ఫిరంగులు మోగినా, తుపాకీ తూటాల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించలేదు. రవ్వంత స్ఫూర్తిని కూడా తగ్గనివ్వలేదు. బలిదానాలు చేసి మరీ సాయుధపోరాటానికి ఊపిరిలూదారు. రజాకార్ల ఆకృత్యాలను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. ఖాసీం రజ్వీ కన్నెర్రజేస్తుండగా, చిత్రహింసలతోటి తెల్లారుతుండగా తెలంగాణ ప్రజలు బిక్కబిక్కుమంటూ బతుకును వెళ్లదీసిన నాటి తెలంగాణ పరిస్థితిని చూస్తే తెలంగాణ ప్రాంతం పోరాటాలతోనే కాలం వెళ్లదీస్తుందని స్పష్టమవుతుంది. భూమికోసం, భుక్తికోసం, తెలంగాణ ప్రాంతం విముక్తికోసం ఎంతోమంది రజాకార్లతో పోరాడి అమరులయ్యారు.

నిజాం వ్యతిరేకంగా పోరాటాలు..

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికి పట్టువదలకుండా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే సెప్టెంబర్ 17, 1948న పోలీస్ చర్యలో భాగంగా నిజాం భారత యూనియన్‌కు లొంగిపోయారు.

ప్రజల డిమాండ్:

దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైంది. అందుకు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రభుత్వమే జరిపించాలని తెలంగాణ ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్‌గా ఉంది. రజాకార్లు తెలంగాణ ప్రాంతంలోని హిందువులపై సాగించిన మారణ, దారుణకాండకు తల్లడిల్లిన గ్రామీణ ప్రజలు సంఘంగా ఏర్పడ్డారు. తెలంగాణ ప్రాంతంలో సంఘం అనేది మెట్టమొదట ఏర్పడడానికి కారణం ఇదేనని చెప్పక తప్పదు. సంఘంగా ఏర్పడిన ప్రజలు వెట్టి, అక్రమ, నిర్భంధ వసూళ్లు వంటి విధానాలు ఇంకెంతో కాలం సాగవని ప్రకటించారు. అంతేకాదు పోరాటమంటే గ్రామాధికారులకు, భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దారులకు వ్యతిరేక పోరాటం కావడంతో రజాకార్లు పోలీసులతో కలిసి ఈ పోరాటాలను అణచివేయాలని చూశారు. దీంతో ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్న పోరాటాలకు అండగా నిలబడ్డారు. రజాకార్లు ఇష్టానుసారంగా దోపిడీలు, మానభంగాలు, గృహదహనాలకు పాల్పడ్డారు. ప్రజలు ప్రతిఘటిస్తే పోలీసులు, రజాకార్లు వచ్చేవారు. దీంతో నిజాం సైన్యం, రజకార్ల దళాలు చేసేటువంటి దురాగతాలను ఎదిరించడం కోసం కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది.

సాయుధ పోరాటంలో అసువులుబాసిన యోధులు

1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ప్రకటిస్తూనే సంస్థానాలను భారత ప్రభుత్వంలో కలుపడం ఇష్టం లేకపోతే స్వయం ప్రతిపత్తితో ఉండాలనే అవకాశం ఇవ్వడంతో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో కలవదని స్వతంత్ర్యంగా ఉంటుందని నిజాం ప్రకటించుకున్నారు. ఫలితంగానే హైదరాబాద్ లో ఉండబడే తెలంగాణ జిల్లాల ప్రజలు అనేక వేధింపులను ఎదుర్కొన్నారు. రజాకార్లతో రణం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది సాయుధ పోరాటమార్గాన్ని ఎంచుకొని పోరుసాగించారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కుర్రారం రామిరెడ్డి, రేణిగుంట రామిరెడ్డితో పాటు ఎంతో మంది సాయుధ పోరాటంలో అసువులుబాసారు. ఈ సందర్భంగానే వరంగల్ జిల్లా బైరాన్ పల్లి, కూటిగల్, మద్దూరు, దూల్‌మిట్ట, లింగాపూర్ వంటి గ్రామాల్లో రజాకార్లు ప్రజలను అనేక వేధింపులకు గురిచేశారు.

ప్రజలు కూడా గ్రామరక్షణ దళాలుగా ఏర్పడి రజాకార్లతో పోరాటం జరిపి అనేక మంది గ్రామస్తులు చనిపోయారు. 1948 సంవత్సరం, మే నెలలోనే రజాకార్లు వారి సైన్యంతో బైరాన్ పల్లి గ్రామంపై దాడి చేసి 118 మందిని చంపివేశారు. అయినప్పటికిని రోజురోజు బాధలకన్న ఒక్కరోజు బాధ మంచిదని నిర్ణయించుకున్న గ్రామాల ప్రజలు గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. వరంగల్, నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో అదే సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరుల పేరిట స్థూపాలు దర్శనమిస్తుంటాయి. కాగా బైరాన్ పల్లిలో చనిపోయిన 118మంది అమరుల పేర్లతో కూడిన స్థూపాన్ని గ్రామస్తులు నిర్మించుకోవడంతో పాటు అమరుల పేర్లను స్థూపంపై చెక్కి తెలంగాణ అమరత్వాన్ని చరిత్రలో నిలబెట్టారు.

ఇవీ కూడా చదవండి: Ola Electric Scooter: ఓలా స్కూటర్‌ రికార్డ్‌.. 24 గంటల్లో రూ.600 కోట్ల విలువైన స్కూటర్ల విక్రయాలు.!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌.. డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకు షాపింగ్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Akbvsb

Related Posts

0 Response to "Telangana Liberation Day: తుపాకీ తూటాల వర్షం కురిసినా.. ఎత్తిన జెండా దించలేదు.. నేడు తెలంగాణ వీమోచన దినం"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel